: నాగార్జున వర్సిటీలో ఉద్రిక్తత...సెలవులను నిరసిస్తూ వీసీ ఛాంబర్ ముందు విద్యార్థుల ధర్నా
వరంగల్ కు చెందిన బీటెక్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటనతో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గడచిన నాలుగైదు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేఫథ్యంలో వర్సిటీకి పది రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ వర్సిటీ ఇన్ చార్జి వీసీ సాంబశివరావు నిన్న నిర్ణయం తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా హాస్టల్ గదులను ఖాళీ చేసి పోవాలని ఆయన నిన్న విద్యార్థులకు ఆదేశాలు జారీ చేశారు. వీసీ నిర్ణయంపై విద్యార్థులు భగ్గుమన్నారు. రిషికేశ్వరి ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకే వర్సిటీకి సెలవులు ప్రకటించారని ఆరోపిస్తూ వీసీ ఛాంబర్ ముందు విద్యార్థులు బైఠాయించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. దీంతో వర్సిటీ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు మరింతగా నెలకొన్నాయి.