: రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను తక్షణమే తీసుకోండి: తెలంగాణకు కేంద్ర హోంశాఖ ఆదేశం
తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి ఏపీ మూలాలున్న 1253 మంది ఉద్యోగుల విషయంలో కేంద్రం స్పందించింది. వారిని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం సరైంది కాదని పేర్కొంది. రిలీవ్ చేసిన ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఏపీ స్థానికత పేరుతో ఉద్యోగులను తొలగిస్తూ తెలంగాణ ఇంధన సంస్థలు తీసుకున్న ఏకపక్ష నిర్ణయం సరికాదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కేంద్రానికి రాసిన ఓ లేఖలో తెలిపారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఓ లేఖ రాసింది. రాష్ట్ర విభజన జరిగినందున 2014 జూన్ 2వ తేదీ తరువాత ఉద్యోగుల విభజన అంశం కమలనాథన్ కమిటీ లేదా ఉమ్మడిగా రెండు రాష్ట్ర ఇంధన సంస్థలు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలా కాకుండా ఏకపక్షంగా ఉద్యోగులను తొలగించడం సరికాదని పేర్కొంది.