: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ప్రేమ వ్యవహారాలు, వ్యసనాల కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరెవరు ఏమన్నారంటే... రైతుల ఇళ్లకు వెళ్లి ఏం జరుగుతుందో చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులను ఆదేశించాలి. అప్పుడర్థమవుతుంది వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో! -రాహుల్ గాంధీ రైతుల బలవన్మరణాలకు మంత్రి చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి కారణాలు చెబుతున్నారు. -సీతారాం ఏచూరి వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు రైతుల పట్ల ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తీవ్ర రుణభారంతోనే రైతులు ప్రాణాలు విడుస్తున్నారు. వారి సంక్షేమం కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలి. - డి.రాజా (సీపీఐ) బుద్ధిలేని తనంతో చేసిన వ్యాఖ్యలన్న విషయం పక్కనబెడితే, ఇవి రైతులను అవమానపరిచే వ్యాఖ్యలు. పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్నందుకు మంత్రిపై చర్యలకు డిమాండ్ చేస్తాం. -కేసీ త్యాగి (జేడీ-యూ) వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవి. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. -నరేశ్ అగర్వాల్ (సమాజ్ వాదీ)