: తత్కాల్ రిజర్వేషన్ గుర్తింపు కార్డు విధానంలో మార్పులు
తత్కాల్ రిజర్వేషన్ విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ, రైల్వే శాఖ నిర్ణయాలు ప్రకటించింది. ప్రస్తుతం తత్కాల్ టికెట్ ను బుక్ చేసుకోవాలంటే గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీ ఒకటి ఇవ్వాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. అదే ప్రూఫ్ ను ప్రయాణ సమయంలో టీసీకి చూపాల్సి వుంటుంది. అలా చూపకుంటే, టికెట్ లేని ప్రయాణికులుగా భావిస్తూ, జరిమానా విధిస్తారు. ఈ విషయంలో పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో, నిబంధనలను రైల్వే శాఖ స్వల్పంగా సడలించింది. రిజర్వేషన్ సమయంలో ఇచ్చిన గుర్తింపు కార్డుతో పాటు మరే ఇతర కార్డ్ అయినా ప్రయాణ సమయంలో చూపించవచ్చని తెలిపింది. ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, ఫోటో కలిగిన క్రెడిట్ కార్డులు, ఆధార్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కార్డులు చూపవచ్చని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించింది.