: చంద్రబాబు లాంచీకి ప్రమాదం ఎలా జరిగిందంటే..!
ఈ మధ్యాహ్నం పుష్కర ఘాట్లను పరిశీలించే నిమిత్తం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బయలుదేరిన లాంచీ, మరో లాంచీని ఢీకొన్న సంగతి తెలిసిందే. ఆ రెండో లాంచీ మీడియా వారు ప్రయాణిస్తున్నది కావడం గమనార్హం. దీంతో దాదాపు అన్ని చానళ్ల కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లూ ఈ ప్రమాదాన్ని చిత్రీకరించారు. సరిగ్గా రాజమండ్రి రైల్వే బ్రిడ్జి కింద ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని చంద్రబాబునాయుడు సైతం ప్రత్యక్షంగా తిలకిస్తూనే ఉన్నారు. ఆయన భద్రతా సిబ్బంది రెండు లాంచీలూ ఢీకోబోతున్నాయని ముందే గ్రహించారు. అందరూ పక్కకు జరగండని కేకలు పెట్టారు. వాస్తవానికి బాబు పుష్కర ఘాట్ల పరిశీలన తతంగాన్ని అన్ని మీడియా సంస్థలకు అందించే నిమిత్తం మరో లాంచీని కవరేజి నిమిత్తం అధికారులు ఏర్పాటు చేశారు. ఆ లాంచీ మీడియా ప్రతినిధులతో కిక్కిరిసి పోయింది. మార్గ మధ్యంలో చంద్రబాబు లాంచీపై ఒక వైపు నుంచి మరో వైపుకి వచ్చారు. దీన్ని గమనించిన మీడియా లాంచీ ఆయనకు అభిముఖంగా వెళ్లేందుకు స్పీడు పెంచి ముందుకు వచ్చింది. దీన్ని గమనించాడో లేదో గానీ, బాబు ప్రయాణిస్తున్న లాంచీ డ్రైవర్, దాన్ని టర్న్ చేయడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో మీడియా లాంచీ పక్కనుంచి ఓవర్ టేక్ చేస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. రెండు లాంచీలూ స్వల్పంగా ఢీకొన్న ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.