: తండోపతండాలుగా వస్తున్న ప్రజలతో ఉభయ గోదావరులు ఉక్కిరిబిక్కిరి!
పుష్కరాలు మరొక్క రోజులో ముగియనున్న నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలు యాత్రికుల తాకిడితో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ప్రత్యేక రైళ్లతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కిక్కిరిసిన ప్రయాణికులతో గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్లకు పైగా ప్రజలుండగా, ఇప్పటివరకూ 3.5 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్టు ఏపీ మంత్రి పీతల సుజాత వివరించారు. మొత్తం నాలుగున్నర కోట్ల మందికి పైగా స్నానాలు చేశారని, వీరిలో ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల సంఖ్య కోటికి దగ్గరగా ఉందని తెలిపారు. రాజమండ్రి నుంచి అంతర్వేది వరకూ ఉన్న దేవాలయాలతో పాటు అన్నవరం సత్యనారాయణస్వామి, బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయాల్లో వేలాది సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బస్సులు చాలక యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో సైతం దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. బాసరలో దర్శనానికి 4 గంటల సమయం, భద్రాచలంలో 6 నుంచి 7 గంటల సమయం పడుతున్నట్టు సమాచారం. మరొక్క రోజు యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, అలసత్వం ఎంతమాత్రమూ ప్రదర్శించ వద్దని అధికారులకు టీఎస్-సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.