: ఈ ఏడాది ఐటీ ఉద్యోగార్థులకు నిరాశే: నాస్కామ్


గతంతో పోలిస్తే, ఈ సంవత్సరం కొత్తగా లభించే ఐటీ ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండనుందని సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ బాడీ 'నాస్కామ్' అంచనా వేసింది. కొత్త ఉద్యోగాల్లో 15 శాతం వరకూ కోత పడనుందని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ వివరించారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఆటోమేషన్ పెరగడం, ఉద్యోగుల విధి నిర్వహణా సమయం గరిష్ఠస్థాయులకు చేరడం వంటి కారణాలతో ఉద్యోగుల సంఖ్య తగ్గనుందని ఆయన అన్నారు. 2014-15లో 2.24 లక్షల కొత్త ఉద్యోగాలు ఈ రంగాన్ని పలకరించగా, ఈ సంవత్సరం సుమారు 2 లక్షలతో సరిపెట్టుకోవాల్సి రానుందని అంచనా వేశారు. క్వాంటిటీ నుంచి క్వాలిటీ దిశగా ఐటీ రంగం రూపాంతరం చెందుతోందని, కొత్త ఉద్యోగుల సంఖ్య తగ్గినా, వృద్ధి రేటు అంచనా 12 నుంచి 14 శాతం వరకూ నమోదవుతుందని, ఈ సంవత్సరం భారత ఐటీ ఇండస్ట్రీ విలువ 119 బిలియన్ డాలర్లకు (సుమారు 7.5 లక్షల కోట్లు) పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు వివరించారు. కొత్త నియామకాల్లో 44 శాతం వరకూ ఆన్ లైన్లో సాగవచ్చని, ఏజన్సీల ద్వారా 21 శాతం, క్యాంపస్ ల నుంచి 14 శాతం, ఎంప్లాయీ రిఫరల్స్ విధానంలో 22 శాతం నియామకాలు జరుగుతాయని అన్నారు. ఐటీ కంపెనీల్లో నిపుణులకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఉద్యోగాలను వీడుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని, సాఫ్ట్ వేర్ పరిశ్రమల్లో 14 నుంచి 18 శాతం, బీపీఓ సంస్థల్లో 25 నుంచి 35 శాతం వరకూ అట్రిషన్ స్థాయిలు నమోదు కానున్నాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News