: 'బాహుబలి'లో సత్యరాజ్ అభినయంపై శోభా డే ప్రశంసలు!
ప్రముఖ రచయిత్రి, కాలమిస్టు శోభా డే 'బాహుబలి' చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఆమె అందులోని పాత్రలపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. ఈ సినిమా రెండవ భాగం 'బాహుబలి 2' కచ్చితంగా చూస్తానని వెల్లడించారు. అది కూడా బాహుబలిలో కట్టప్ప పాత్ర కోసం టికెట్ ముందుగా బుక్ చేసుకుంటానని చెప్పారు. ఆ పాత్ర తనకు చాలా నచ్చిందని, రాజకుటుంబానికి నమ్మిన బంటుగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయారని ఆంగ్ల చానల్ ఎన్డీటీవీ వెబ్ సైటుకి రాసిన వ్యాసంలో శోభా స్పష్టం చేశారు. ప్రభాస్, రానా, తదితరులు తమ పాత్రలకు బాగా సరిపోయారన్నారు. రాజమాతగా నటించిన రమ్యకృష్ణ కట్టిన ఏడు గజాల చీరలు చాలా బాగున్నాయన్నారు. గిరిజనులను శత్రువులుగా చూపిన విధానం అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఆంగ్లంలో విజయవంతమైన సినిమాలను బాగా స్టడీ చేసి అవసరమైన ఎలిమెంట్స్ 'బాహుబలి'లో ఉండేలా దర్శకుడు రాజమౌళి చాలా జాగ్రత్త పడ్డారన్నారు.