: రాహుల్ పర్యటనపై అచ్చెన్న మండిపాటు... విభజన పాపం కాంగ్రెస్ దేనని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్రపై టీడీపీ నేత, ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీ నేతగా ఏ ముఖం పెట్టుకుని రాహుల్ గాంధీ ఏపీకి వచ్చారని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజలను విడదీసిన పాపం ముమ్మాటికీ సోనియా గాంధీదేనని అచ్చెన్న ఆరోపించారు. రాష్ట్ర విభజనతో ప్రయోజనం దక్కుతుందన్న దుర్బుద్ధితోనే సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు పచ్చ జెండా ఊపారని ఆయన అన్నారు. ఇంకా 50 ఏళ్ల పాటు పోరాడినా కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కదని కూడా అచ్చెన్న జోస్యం చెప్పారు.