: ‘చెన్నై’ యజమానిగా ధోనీ?... ఐపీఎల్ జట్టును దక్కించుకునేందుకు కెప్టెన్ కూల్ సన్నాహాలు
కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియా వన్డే, టీ20 జట్లకు మాత్రమే కాక ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా నాయకుడే. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నైతో పాటు రాజస్థాన్ జట్లపై జస్టిస్ లోధా కమిటీ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడే విషయం ప్రశ్నార్థకంగా మారింది. బీసీసీఐకి ఇచ్చిన నివేదికలో ‘యాజమాన్యాలు మారితే, ఆ రెండు జట్లను ఐపీఎల్ కొనసాగించొచ్చు’’ అని జస్టిస్ లోధా పేర్కొన్నారు. ఇక ఆటకు దూరంగా ఉండటమంటే అంతగా ఇష్టపడని ధోనీ, వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎలాగైనా ఆడాల్సిందేనని దాదాపుగా నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలో నిన్నటిదాకా తన కెప్టెన్సీలో ఆడిన చెన్నై జట్టును ఏకంగా కొనుగోలు చేయాలని కూడా అతడు తలపోస్తున్నాడట. ఈ దిశగా జస్టిస్ లోధా ఇచ్చిన సింగిల్ అవకాశాన్ని అతడు తనకు అనుకూలంగా మార్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. అతడనుకున్నట్లు జరిగితే, తన నాయకత్వంలోని జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించే అరుదైన అవకాశం ధోనీ సొంతమైనట్టే!