: ముషారఫ్ మహోన్నతుడట... పాఠ్య పుస్తకంలో పాక్ నియంతకు చోటు!
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను మహోన్నత వ్యక్తుల జాబితాలో చేర్చింది ఓ ముద్రణ సంస్థ. ఆ పాఠ్య పుస్తకంలో ఏముందో చూడకుండా గుడ్డిగా బోధిస్తోంది మధ్యప్రదేశ్ లోని ఓ ప్రైవేటు పాఠశాల. జబల్పూర్ లోని అవధ్ పురి ప్రాంతంలో ఉన్న క్రైస్ట్ ఆశా స్కూల్లో మూడవ తరగతి విద్యార్థుల పాఠ్య పుస్తకంలో ఈ తప్పిదం కనిపించింది. 'ఆరుగురు మహోన్నత వ్యక్తులు' శీర్షికతో ఉన్న పాఠంలో ఈ సైనిక నియంత పేరు కూడా చేర్చారు. దీనిపై జిల్లా బార్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. పుస్తక రచయితపైనా, పబ్లిషర్ పైనా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో, సదరు పాఠశాల ఆ పాఠ్య పుస్తకాన్ని తొలగించింది. ఆ పుస్తకాన్ని పంకజ్ జైన్ రచించగా, గాయత్రి పబ్లికేషన్స్ ప్రచురించింది. ముషారఫ్ హయాంలోనే కార్గిల్ యుద్ధం చోటుచేసుకుందని, ఎంతోమంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారని బార్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఇలాంటి తప్పిదాలతో చిన్నారుల భవిష్యత్ తో ఆడుకుంటున్నారని విమర్శించారు. కాగా, పుస్తకంలోని కంటెంట్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సీఈఆర్ టీ) సిలబస్ కు అనుగుణంగానే ఉందని ప్రచురణకర్త అంటున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందన కోరగా, తాము దీనిపై ఎన్ సీఈఆర్ టీకి లేఖ రాశామని తెలిపారు.