: సభను అడ్డుకోవడమే లక్ష్యం కాకూడదు: వెంకయ్యనాయుడు
పార్లమెంటు ఉభయ సభలను అడ్డుకోవడమే ప్రతిపక్షాల లక్ష్యం కాకూడదని పార్లమెంటరీ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రతిపక్షాలకు హితవు పలికారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రక్రియను గౌరవించి పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఎంతో అనుభవం ఉన్న కాంగ్రెస్ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని ఆయన సూచించారు. లలిత్ గేట్ అంశంలో రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. లలిత్ గేట్ అంశంపై స్పష్టమైన ప్రకటన చేసేందుకు విదేశాంగ శాఖ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. సుష్మాస్వరాజ్ చర్చకు సిద్ధమని తెలిపారని ఆయన అన్నారు. పార్లమెంటు సజావుగా సాగితేనే అది సాధ్యమని ఆయన చెప్పారు.