: ఆ పదం కులాన్ని సూచిస్తుందని తెలియదు: బాహుబలి డైలాగ్ పై మదన్ కార్కీ వివరణ


తమిళనాడులో బాహుబలి సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్ పై పెట్రోల్ బాంబులతో దాడి జరగడం తెలిసిందే. ఆ సినిమాలో తమను కించపరిచేలా డైలాగులు ఉన్నాయంటూ ఓ వర్గం తల్లాకుళంలో ఆందోళనకు దిగింది. 'పగడాయ్' అనే పదాన్ని సినిమాలో వాడడం తమకు అభ్యంతకరమని వారు పేర్కొన్నారు. దీనిపై బాహుబలి తమిళ వెర్షన్ కు డైలాగులు రాసిన మదన్ కార్కీ వివరణ ఇచ్చారు. అంతేగాకుండా సదరు వర్గానికి క్షమాపణ తెలిపారు. "బాహుబలిలోని డైలాగు ఓ కమ్యూనిటీ మనోభావాలను దెబ్బతీసిందని, తద్వారా ఆ వర్గీయులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారన్న వార్తలు మీడియా ద్వారా తెలుసుకున్నాను. 'ఎన్ తాయాయుమ్ తాయ్ నాట్టాయ్యుమ్ ఎంద పగడైక్కు పిరందవణుమ్ తొడ ముడియాదు...' ఇదీ డైలాగు! 'పగడైక్కు పిరందవన్' అంటే పాచికలాటలో ఓటమి కారణంగా జన్మించిన వ్యక్తి అన్న అర్థం వస్తుంది. పగడైక్కులోని 'పగడాయ్' అనేది ఓ కులాన్ని సూచిస్తుందని నాకు తెలియదు. ఏ వర్గాన్నీ కించపర్చాలన్న ఉద్దేశం మాకు లేదు. ఆ పదాన్ని తప్పక తొలగిస్తాం. ఎవరైనా ఆ పదం కారణంగా బాధ పడి ఉంటే వారిని క్షమించమని కోరుతున్నా" అని తెలిపారు. 'పగడాయ్' అనే పదం తమిళనాడులో ఓ దళిత ఉపకులాన్ని సూచిస్తుంది.

  • Loading...

More Telugu News