: సినిమా టికెట్ చూపించమని అడిగినందుకు దాడి చేసిన ఎమ్మెల్యే కుమారుడు
ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని సమాజ్ వాదీ పార్టీ నేతలతో పాటు వారి పుత్రులు కూడా దౌర్జన్యాలు చేస్తున్నారనడానికి మరో ఉదాహరణ ఇది. ఓ షాపింగ్మాల్లో గార్డుగా చేస్తున్న వ్యక్తిపై ఓ మహిళా ఎమ్మెల్యే కొడుకు, అతడి స్నేహితులు దాడి జరిపారు. వివరాల్లోకి వెళితే, లక్నోలోని గోమతి నగర్ లో ఉన్న ఓ షాపింగ్ మాల్ లోని సినిమా థియేటర్కు మున్నీ సింగ్ అనే ఎమ్మెల్యే కొడుకు ఉగ్రసేన్ ప్రతాప్ సింగ్ వెళ్లాడు. అక్కడ ఉన్న ఓ సినిమా హాల్ లోకి వీరు వెళ్లబోగా, సెక్యూరిటీ గార్డు టికెట్లు చూపాలని కోరాడు. 'మమ్మల్నే టికెట్లు అడుగుతావా?' అంటూ అతనిపై దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్రగాయాలు కాగా, మొత్తం ఉదంతం సీసీటీవీల్లో రికార్డయింది. ఎమ్మెల్యే కుమారుడి దౌర్జన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. యూపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని బీజేపీ ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ ఆరోపించారు. తక్షణం నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.