: వరంగల్ ఎంపీ టికెట్ ను నా కుమార్తెకు అడగలేదు: కడియం శ్రీహరి
వరంగల్ లోక్ సభ సీటుకు కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో, అక్కడి నుంచి ఆయన కుమార్తె కావ్య పోటీ చేయబోతున్నారని, అందుకు కడియం కూడా ప్రయత్నాలు చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను తాజాగా మంత్రి కడియం ఖండించారు. ఈ సీటుకు త్వరలో జరగబోయే ఉపఎన్నికల్లో తన కూతురికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఓ తెలుగు వార్తా చానల్ తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. అసలేనాడు తాను ఆ ప్రయత్నం కూడా చేయలేదని చెప్పారు. పార్టీ ఎవరికి అవకాశం ఇచ్చినా గెలిపించుకుంటామన్నారు. తన కుమార్తె వైద్య వృత్తిలో స్థిర పడిందని, వైద్య సేవలందిస్తూ ప్రజాసేవ చేయడమే ఆమె లక్ష్యమని వివరించారు. ఈ విషయంలో గతంలోనే తాను స్పష్టత ఇచ్చానని, అయినా మళ్లీ తెరపైకి తన కుమార్తె పేరు తీసుకురావడం సరికాదన్నారు.