: రెండు రోజులు వేస్ట్... మూడో రోజూ అదే తీరు!
21 రోజుల పాటు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తొలి రెండు రోజులు వృథా కాగా, మూడవ రోజు సైతం అదే దారిలో సాగుతోంది. మోదీ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ తదితర విపక్షాలు వ్యవహరిస్తూ, సభా కార్యకలాపాలను వరుసగా మూడవ రోజూ అడ్డుకున్నాయి. ఏ విషయంపై అయినా చర్చించేందుకు తాము సిద్ధమని చెబుతున్నామని, అయినా విపక్షాలు వినడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విమర్శించారు. తొలి రెండు రోజుల్లో కళంకిత మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాల్సిందేనని కాంగ్రెస్ పట్టుబట్టి సభను అడ్డుకుంది. వ్యాపమ్ కుంభకోణం, మహారాష్ట్రలో అంగన్ వాడీ నిధుల స్కామ్, లలిత్ గేట్ తదితరాంశాలను తెరపైకి తెచ్చి చర్చల కోసం వివిధ మార్గాల్లో నోటీసులు ఇవ్వగా, వేటిపై కూడా చర్చకు లోక్ సభ స్పీకర్ కాని, రాజ్యసభ చైర్మన్ కాని అనుమతించని సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీ కూడా గట్టి పట్టుతో ఉండటంతో నేడు కూడా సభా కార్యకలాపాలు ఆగిపోయాయి. ఇలా చర్చలు లేకుండా ఇంకెన్ని రోజులు సభా కార్యకలాపాలు ఆగిపోతాయోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.