: పిండాలను గోదావరిలో కలపకుండా మెట్లపైనే వదిలి వెళ్లిన చిరంజీవి... చెత్తకుండీలో వేసిన పారిశుద్ధ్య కార్మికులు


కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవి చేసిన పనికి సాక్షాత్తు పురోహితుడే విస్తుపోయారు. ఏం జరిగిందో తెలిస్తే, మనమూ విస్తుపోక తప్పదు. నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు తన బావమరిది అల్లు అరవింద్ తో కలసి రాజమండ్రిలోని వీఐపీ ఘాట్ కు చిరంజీవి చేరుకున్నారు. చిరంజీవి వస్తున్నారన్న వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు కూడా అప్పటికే భారీ సంఖ్యలో ఘాట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే, పిండప్రదానానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేశారు. పోలీసు బందోబస్తు మధ్య అక్కడకు వచ్చిన చిరంజీవి గోదావరిలోకి వెళ్లి స్నానమాచరించారు. అనంతరం మెట్లపై కూర్చుని పిండప్రదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పక్కన అల్లు అరవింద్ కూడా పూజకు ఉపక్రమించారు. ఈలోగా ఘాట్ వద్ద జనాలు పెరిగారు. చిరంజీవిని చూసేందుకు యాత్రికులు ఎగబడ్డారు. దీంతో, ఐదు నిమిషాల్లోనే తంతును ముగించేసిన చిరంజీవి... పిండాలను గోదావరిలో కలపకుండా మెట్లపై అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. గోదావరిలో పిండాలను కలపాలని పురోహితులు సూచిస్తున్నప్పటికీ, ఆయన అక్కడ నుంచి బయల్దేరారు. ఈ ఘటనతో, అప్పటి వరకు చిరంజీవితో క్రతువు నిర్వహించిన పురోహితుడు చేష్టలుడిగిపోయారు. అక్కడే ఉన్న అభిమానులు, యాత్రికులు షాక్ కు గురయ్యారు. దీన్ని అపచారంగా భావించిన చిరంజీవి అభిమానులు ఆయన వదిలేసిన తీర్థవిధులను పారిశుద్ధ్య కార్మికులతో ఎత్తించి, చెత్తకుండీలో వేయించారు. ఇలా చేయడం శాస్త్ర విరుద్ధమని, శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన వాటిని అర్థాంతరంగా ముగించడం మంచిది కాదని పురోహితులు చెబుతున్నారు. ఇంతా చేసిన చిరంజీవి ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, పుష్కర మహాత్మ్యం, దాని ఫలితాల గురించి వివరించడం గమనార్హం.

  • Loading...

More Telugu News