: అమరావతి మాస్టర్ ప్లాన్ కు అడ్డుగా మూడు గ్రామాలు... కింకర్తవ్యం!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ఏపీ సర్కారు చేతికి వచ్చింది. ఓ సుందర అద్భుత స్వప్నాన్ని కళ్లముందుంచింది. చూసేవారికి అసలు ఇండియానేనా? అనిపించేలా మాస్టర్ ప్లాన్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఏ నగరమూ లేనంత అందంగా కనిపించింది. అంతా బాగానే వుంది. మాస్టర్ ప్లాన్ మధ్యలో మూడు గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 6 వేల మంది వరకూ ప్రజలున్నారు. ఇక మాస్టర్ ప్లాన్ శివార్లలో, అంటే తదుపరి దశ అభివృద్ధి జరిగే చోట మరో 10 గ్రామాలకు పైగానే ఉన్నాయి. రాజధాని మధ్యలో 3 గ్రామాలు ఉండటం ఏపీ సర్కారు ఆలోచనలకు బ్రేక్ వేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. బృహత్తర ప్రణాళికల మధ్యలో ఉన్న గ్రామాల వారితో చర్చించి వారిని అక్కడి నుంచి తరలించే విషయమై నిర్ణయం తీసుకోవాలని బాబు సర్కారు భావిస్తోంది. అయితే, ఇప్పటికే తమ భూములను భూసేకరణ పేరిట తీసేసుకున్న ప్రభుత్వం, ఇళ్లను కూడా ఖాళీ చేయాలని చెబితే తీవ్ర ఉద్యమం చేస్తామని ప్రజలు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రజలను ఎలా ఒప్పించాలన్న అంశంపై చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులతో చర్చలు జరుపుతున్నారు.