: నది మధ్యలో భక్తులు... పోటెత్తిన వరద... అప్రమత్తతతో తప్పిన ముప్పు
గోదావరి పుష్కరాల్లో భాగంగా తెలంగాణలో ఏర్పాటు చేసిన ఓ పుష్కర ఘాట్ వద్ద నిన్న పెను ప్రమాదం తృటిలో తప్పింది. అధికారులు సకాలంలో స్పందించకపోయి ఉంటే భారీ ప్రాణనష్టమే సంభవించి ఉండేదన్న ఆందోళన వ్యక్తమైంది. వివరాల్లోకెళితే... కరీంనగర్ జిల్లా జగిత్యాల పరిధిలోని ధర్మపురి వద్ద ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ఘాట్ వద్ద నిన్న ఉదయం నుంచే భక్తుల రద్దీ నెలకొంది. నీరు తక్కువగా ఉండటంతో భక్తులు నది మధ్యలోకి వెళ్లి ఉత్సాహంగా పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు పోటెత్తింది. నిన్న ఉదయం సరిగ్గా 9.30 గంటకు మహాలక్ష్మి ఘాట్ ను వరద నీరు క్రమంగా ముంచెత్తడం ప్రారంభించింది. అప్పటికే నది మధ్యలో పెద్ద సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. నీటిమట్టం పెరగడాన్ని గమనించిన అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. నదిలోకి తాళ్లు విసిరేసి భక్తులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.