: బీజేపీ చేతికి అస్త్రం...స్టింగ్ ఆపరేషన్ లో దొరికిపోయిన ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శి


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీని నిలువరించేందుకు బీజేపీకి అస్త్రం దొరికింది. మోదీగేట్, వ్యాపం కుంభకోణం, భూసేకరణ బిల్లులపై ఎలా ముందుకెళ్లాలా? అని దీర్ఘాలోచనలో మునిగిన బీజేపీని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యక్తిగత కార్యదర్శి మహ్మద్ షాహిద్ ఒడ్డున పడేశారు. మద్యం లైసెన్సు కేటాయింపుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, భారీ ఎత్తున డబ్బు చేతులు మారిందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో, ఓ వార్తా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో సీఎం వ్యక్తిగత కార్యదర్శి మహ్మద్ షాహిద్ ప్రభుత్వ పెద్దలకు అందించాల్సిన వాటాల వివరాలు చర్చిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ముందు కొంత అడ్వాన్స్ గా, మిగిలినది పని పూర్తయ్యాక చెల్లించాలంటూ ఆయన పేర్కొనడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, మద్యం లైసెన్సుల ద్వారా వచ్చే లంచాల గురించి మాట్లాడడం దారుణమని అన్నారు. సీఎం హరీష్ రావత్ తక్షణం రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి హోదాలో మహ్మద్ షాహిద్ మూడు కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తారని, అలాంటి ఆయన లంచాల గురించి మాట్లాడడం దారుణమని ఆమె పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News