: ముంబైలో దారుణం...తండ్రిపై టీచర్ కి ఫిర్యాదు చేసిన బాలిక


చాలామంది తల్లిదండ్రులు కన్నబిడ్డలను కంటిపాపల్లా సాకేందుకు అహరహం శ్రమిస్తుంటారు. వారికి చిన్నదెబ్బ తగిలినా విలవిల్లాడిపోతారు. తండ్రి గుండెలమీద వేసుకుని పెంచుతాడు... తల్లి తన జీవితాన్నే వారికి ధారపోస్తుంది. కానీ, ముంబయిలో జరిగిన ఈ ఘటన గురించి వింటే "ఛీ... ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా?" అన్న ఏహ్యభావం, ఆ వెంటనే తీవ్ర ఆగ్రహం కలుగుతాయి. వివరాల్లోకెళితే... ముంబయిలో సెవెన్త్ క్లాస్ చదువుతున్న 13 ఏళ్ల బాలిక తన టీచర్ కు గతవారం ఓ లేఖ రాసింది. అదేదో లీవ్ లెటర్ అనుకున్న సదరు టీచర్ చదివిన తర్వాత దిగ్భ్రాంతికి గురైంది. "టీచర్ మీరే నన్ను కాపాడాలి... మా నాన్న నాపై అత్యాచారం చేస్తున్నాడు. నాకు ఏడేళ్ల వయసు నుంచే ఈ విధంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. నా తోబుట్టువులు లేని సమయంలో దారుణానికి పాల్పడుతున్నాడు. మా అమ్మ కూడా అతనికి సహకరిస్తోంది. ఇదేంటని నాన్నను ప్రశ్నించదు. అత్యాచారం తర్వాత ఆమె ఏవో మాత్రలు ఇస్తుంది. మందులని చెబుతుంది. తల్లి సమక్షంలోనే ఇదంతా జరుగుతుంటే నేనింకెవరితో చెప్పుకునేది? మీరైనా నన్ను రక్షిస్తారని కోరుకుంటున్నా టీచర్!" అని లేఖలో తన నిస్సహాయతను వ్యక్తం చేసింది. లేఖ చదివిన ఆ టీచర్ వెంటనే ఓ ఎన్జీవోను సంప్రదించి వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణంలో తల్లి పాత్రపై మరికాస్త దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఆమె ఇచ్చిన మాత్రలు గర్భనిరోధక మాత్రలా? ఇతర మాత్రలా? అన్నది తేల్చుకుని ఆమెను కూడా అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. ముంబయిలోని స్కూళ్లలో ఇటీవల లైంగిక దాడుల పట్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాయి. తండ్రి తనపై చేస్తున్నది అత్యాచారమని ఈ తరగతుల్లో తెలుసుకున్న విషయాల ద్వారానే బాలికకు అవగతమైంది. దీంతో, తండ్రి దురాగతాన్ని లేఖ ద్వారా వెల్లడించింది. అన్నట్టు... ఆ బాలికకు ఓ అక్క (17) కూడా ఉంది. ఆమె కూడా ఆ కాముక తండ్రి బాధితురాలేనట. ఇరుగుపొరుగుకు ఈ దారుణాన్ని వివరించినా పట్టించుకోలేదట. దాంతో, కుటుంబం నుంచి వేరుగా ఉంటోందని పోలీసులు తెలిపారు. కన్నబిడ్డలను కాటేస్తున్న ఆ కీచకుడు (45) ఓ చిరువ్యాపారి అని, పండ్లు అమ్ముతుంటాడని వారు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News