: అమరావతి నిర్మాణానికి బిడ్లను దాఖలు చేయనున్న సింగపూర్ సంస్థలివే!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర మాస్టర్ ప్లాన్ సిద్ధమైపోయింది. దీంతో నగర నిర్మాణం జరిపేందుకు ఏ సంస్థలకు కాంట్రాక్టులు లభిస్తాయన్న అంశం తెరపైకి వచ్చింది. సింగపూర్ కు చెందిన ప్రముఖ డెవలపర్లు అమరావతి నిర్మాణానికి కాంట్రాక్టులను పొందేందుకు బిడ్లను దాఖలు చేయాలని నిర్ణయించాయి. అసెండాస్ - సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ప్ డెవలప్ మెంట్ కంపెనీలు రాజధాని అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని కంపెనీలూ కాంట్రాక్టులను దక్కించుకునేందుకు తమవంతు ప్రయత్నాలు జరుపుతున్నట్టు సమాచారం. కాగా, మాస్టర్ ప్లాన్ ను అందించిన సింగపూర్ మంత్రి ఎస్ ఈశ్వరన్, తమ దేశానికి చెందిన ఎన్నో కంపెనీలు అమరావతి నిర్మాణానికి ముందుకు వస్తున్నట్టు ఇప్పటికే చంద్రబాబుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతి నిర్మాణ సమయంలో ఏ కంపెనీ అత్యధికులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తుందో, ఆ సంస్థకే బాధ్యతలు అప్పగించాలన్నది చంద్రబాబు అభిమతం.