: 'పెళ్లిళ్ల పేరయ్య'లు మీకు చెప్పని విషయాలివే!


'వివాహాలు స్వర్గంలో కుదర్చబడతాయి' ఇది అందరూ నమ్మే నానుడి. కాబోయే భాగస్వామి ఎవరన్న విషయం ఆ సమయం దగ్గరకు వచ్చే వరకూ తెలియదు. యువకులు ఎన్ని సంబంధాలు చూసినా, యువతులు ఎందరి ముందు పెళ్లి చూపులకు కూర్చున్నా, రాసిపెట్టిన వారే జీవిత భాగస్వామి అవుతారు. మారిన కాలపరిస్థితులు, జీవన గమనంలో వచ్చిన వేగం, అందుబాటులోని అధునాతన సాంకేతికత ఎన్నో వివాహ సంబంధాలను కుదిర్చే వెబ్ సైట్లను అందుబాటులోకి తెచ్చింది. ఎంతో మంది వివాహ సంబంధాలను కుదర్చడమే వృత్తిగా పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే, జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి వీరిని ఆశ్రయించినప్పుడు ఈ 'పెళ్లిళ్ల పేరయ్య'లు యువతి లేదా యువకుడికి సంబంధించిన పలు విషయాలను కస్టమర్ల దగ్గర దాచివుంచుతారు. అవి ఏంటంటే... జాతకాలు: భారత సంప్రదాయంలో జాతకాలు కలవడం అన్నది చాలా ముఖ్యం. ఎంబీఏ చదివినా, నెలకు ఆరంకెల వేతనం సంపాదిస్తున్నా, జాతకాలు కలవక పోతే వివాహానికి శుభం కాదని నూటికి 99 శాతం మంది నమ్మే దేశం మనది. ఈ విషయంలో తమ స్వలాభం చూసుకునే 'పెద్దలు' వీటిని మార్చి రాయడం వంటివి చేస్తూ తప్పుదారి పట్టించే ప్రమాదం ఉంది. వధూవరుల గత చరిత్ర: తమ వద్దకు సంబంధాల నిమిత్తం వచ్చే యువకుడు లేదా యువతి గత చరిత్రలో ఏమైనా తేడాలుంటే, ఈ విషయాలను పెళ్లిళ్ల పేరయ్యలకు తెలిసినా వాటిని పంచుకోరు. వివాహం చేసుకోబోయే వారి గుణగణాలు, మంచి చెడ్డలు, కుటుంబ నేపథ్యం తదితరాలను స్వయంగా విచారించుకోవాల్సి వుంటుంది. వంట విషయాలు: అమ్మాయికి వంట చేయడం వచ్చా? ఈ ప్రశ్నను సంధిస్తే వచ్చే సమాధానం 'అవును' అనే ఉంటుంది. కానీ, కోడలిగా వచ్చిన అమ్మాయి వంటింట్లో సాయపడాలని ప్రతి అత్తా భావిస్తుంది. ఇదే సమయంలో తమ బిడ్డను కాళ్లు కందకుండా పెంచుకునే తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ఆమెను వంటగదికి సాధ్యమైనంత దూరంగానే ఉంచుతుంది. ఇదే విషయమై వివాహ సంబంధాలు కుదిర్చిన పెద్దలు తప్పుదారి పట్టించిన సందర్భాలు, ఆపై కాపురాలు కూలి విడాకుల దాకా వెళ్లిన ఘటనలూ ఎన్నో ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఓ ఐదు నిమిషాల సమయం కేటాయించి పెళ్లికి ముందే చర్చలు జరిపితే సరిపోతుంది. అలవాట్లు: నేటి తరం యువతలో 40 శాతం మంది ధూమపానానికి, అంతకన్నా ఎక్కువ మంది మద్యపానానికి, పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారని వివిధ సర్వేలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పెళ్లిళ్లు కుదిర్చేవారు అబ్బాయి అలవాట్లపై సమాచారాన్ని గోప్యంగానే ఉంచుతారు. ఇండియాలో 80 శాతానికి పైగా వివాహాలు జరిగిన తరువాతే, తామెంచుకున్న జీవిత భాగస్వామికి ఉన్న చెడు అలవాట్ల గురించి తెలుసుకుంటున్నారన్నది వాస్తవం. పెళ్లికి ముందే పూర్తిగా విచారిస్తే అసలు విషయం తెలుస్తుంది. ఆపై ముందడుగు వేయాలా? వద్దా? అన్నది వ్యక్తిగత అభిప్రాయం. ఆస్తిపాస్తుల వివరాలు: అబ్బాయికేమండీ... వెనకాల బోలెడు ఆస్తుంది అనో... అమ్మాయి ఒక్కర్తే కూతురు, ఉన్నదంతా ఆమెకే అనో... ఇలా సంబంధాలు కుదర్చడమే వృత్తిగా పెట్టుకు బతికేవారు ఎన్నో చెబుతారు. అబ్బాయి నెలకు సంపాదిస్తున్న వేతనాన్నీ పెంచి చెబుతూ అసలు నిజాలు దాస్తారన్న ఆరోపణలూ వీరిపై ఉంటాయి. ఈ విషయాల్లో పారదర్శకత కోసం డాక్యుమెంట్ల పరిశీలన, బ్యాంకు ఖాతాల వివరాలు చూడటం వంటివి చేయవచ్చు. కాబట్టి, జీవిత భాగస్వామిని ఎంచుకునే ముందు 'పెళ్లిళ్ల పేరయ్య'లు చెప్పే మాటలే వినకుండా కాస్త సొంత తెలివితేటలు కూడా ఉపయోగించి అన్నీ ముందే తెలుసుకుంటే మంచిదని నిపుణుల సలహా.

  • Loading...

More Telugu News