: రాహుల్ బందోబస్తు ఏర్పాట్లలో మిస్ ఫైర్... తృటితో తప్పిన ప్రమాదం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ పర్యటనకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లలో కొద్దిసేపటి క్రితం మిస్ ఫైర్ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వివరాల్లోకెళితే... అనంతపురం జిల్లాలో ఈ నెల 24న జరగనున్న రాహుల్ పర్యటనకు కర్నూలు నుంచి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు వెళ్లనున్నాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయం (డీపీఓ)లో కానిస్టేబుళ్లు సరంజామా సర్దుకుంటున్నారు. ఉన్నట్టుండి ఓ కానిస్టేబుల్ చేతిలోని ఎస్ఎల్ఆర్ తుపాకి మిస్ ఫైర్ అయ్యింది. తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్ ముగ్గురు కానిస్టేబుళ్లకు అతి సమీపంగా వెళ్లింది. దీంతో అక్కడ కలకలం రేగింది.