: బంగారాన్ని వదులుకుంటున్న చైనా... సొంతం చేసుకునేందుకు ముందుకు రాని భారతీయులు!


ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా, చైనాలు ముందు వరుసలో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. చైనాలో స్టాక్ మార్కెట్ పతనంతో బంగారం ధరలు కూడా భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన ఎందరో ఒక్కసారిగా విక్రయాలకు దిగారు. దీంతో చైనా మార్కెట్లో బంగారం ధర ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇండియా లేదా మరో ఆసియన్ దేశం నుంచి బంగారం కొనేందుకు ట్రేడర్లు వస్తారని భావించిన చైనీయులకు నిరాశే ఎదురైంది. రుతుపవనాలు సంతృప్తిగా లేకపోవడం, శుభకార్యాల సీజన్ కాకపోవడం, స్టాక్ మార్కెట్లు అంతంతమాత్రంగా ఉండటం తదితర కారణాలతో ఇండియన్ ట్రేడర్లు, స్టాకిస్టులు కొత్తగా బంగారం కొని నిల్వ చేసి పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న డిమాండులో 20 శాతానికి పైగా ఇండియా నుంచి వస్తుంది. ఇప్పుడు మాత్రం ధరలు తగ్గినా కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని కామర్స్ బ్యాంకు సీనియర్ అనలిస్ట్ కార్ స్టెన్ ఫ్రిచ్ అభిప్రాయపడ్డారు. ఆసియన్లు బంగారం కొనకపోతే ఇంకెవరు కొంటారని ఆయన ప్రశ్నించారు. కాగా, ప్రస్తుతం మార్చి 2010 స్థాయిలో 1,085 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధర తదుపరి సెషన్లలో మరింతగా తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు మరింత తగ్గుతాయన్న ఆలోచనలతోనే ఇండియన్స్ బంగారం కొనుగోళ్లకు ముందుకు రావడం లేదని చెన్నై కేంద్రంగా బంగారం హోల్ సేల్ వ్యాపారం చేస్తున్న ఎంఎన్సీ బులియన్ డైరెక్టర్ ప్రకాష్ రాథోడ్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 1000 డాలర్ల దిగువకు వస్తే కొత్త కొనుగోళ్లు వెల్లువెత్తవచ్చని సింగపూర్ ట్రేడర్లు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News