: సుప్రీం గడపతొక్కిన ‘కాల్ డేటా’ వ్యవహారం...సర్వీస్ ప్రొవైడర్ల పిటీషన్ పై రేపు విచారణ


ఓటుకు నోటు కేసుతో వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ వివాదంలో కీలకంగా మారిన కాల్ డేటా వెల్లడికి సర్వీస్ ప్రొవైడర్లు ససేమిరా అంటున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా 120 మంది ఫోన్లను తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని ఏపీ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. కాల్ డేటా వివరాల కోసం సిట్ చేసిన విజ్ఞప్తిని సర్వీస్ ప్రొవైడర్లు తిరస్కరించగా, వారిని సిట్ అధికారులు కోర్టుకు లాగారు. సిట్ పిటీషన్ ను విచారించిన విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు, కాల్ డేటా వివరాలను ఈ నెల 24లోగా ఇవ్వాల్సిందేనని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. అయితే కాల్ డేటాను వెల్లడిస్తే, కేసులు పెడతామన్న తెలంగాణ ప్రభుత్వ బెదిరింపులతో సర్వీస్ ప్రొవైడర్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. దీంతో ఎటూ తేల్చుకోలేకపోతున్న సర్వీస్ ప్రొవైడర్లు, ఈ సమస్య నుంచి తమకు విముక్తి కల్పించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విజయవాడ కోర్టు విధించిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో తమ పిటీషన్ ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. దీంతో సర్వీస్ ప్రొవైడర్ల పిటీషన్ పై జస్టిస్ సీపీ ఠాకూర్, జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ భానుమతిలతో కూడా త్రిసభ్య ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.

  • Loading...

More Telugu News