: 'డ్రోన్ కు తుపాకీ'... యూఎస్ ఎఫ్ఏఏకు ఓ యువకుడి సవాల్!
ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కనెక్టికట్ పరిసరాల్లో తీసినట్టుగా భావిస్తున్న ఈ వీడియోలో ఓ డ్రోన్ కు తుపాకీ కట్టి, దాన్ని గాల్లోకి లేపి నాలుగు రౌండ్లను గుర్తు తెలియని లక్ష్యంపై కాల్చుతున్నట్టు ఉంది. తుపాకీ ట్రిగ్గర్ ను నియంత్రించేందుకు డ్రోన్ కు రిమోట్ తో పనిచేసే ప్రత్యేక మెకానికల్ వ్యవస్థను అదనంగా అమర్చినట్టు తెలుస్తోంది. ఈ 'ఎగిరే తుపాకీ' వీడియో 14 సెకన్ల పాటు ఉండగా, ఇప్పటికే 20 లక్షల మందికిపైగా చూసేశారు. యూఎస్ లో పౌరులు వాడుతున్న డ్రోన్లపై ఎటువంటి నియంత్రణా లేకపోవడంపై మరోసారి తీవ్ర చర్చ కూడా మొదలైంది. జూలై 10న వీడియోను పోస్ట్ చేశారని, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న 18 సంవత్సరాల ఆస్టిన్ హ్యుగ్ వాట్ దీన్ని తయారు చేశాడని తెలుస్తోంది. ఆస్టిన్ తండ్రి మాత్రం తన కొడుకు ఎటువంటి డ్రోన్ నూ తయారు చేయలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రస్తుతం అమల్లో ఉన్న ఫెడరల్ ఏవియేషన్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అన్న విషయమై విచారణ జరుపుతున్నట్టు ఎఫ్ఏఏ తెలిపింది. డ్రోన్లను అడ్డుకోకుంటే పెను ప్రమాదాలు జరగవచ్చని ఎఫ్ఏఏ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. నేడు తుపాకులు కట్టి పేల్చేందుకు వీలు కల్పించిన సాంకేతిక పరిజ్ఞానం, భవిష్యత్తులో బాంబులు కూడా కట్టి ప్రజలు ఎక్కువగా ఉన్న చోట, వేదికలపై జారవిడిచే అవకాశాలున్నాయని నెటిజన్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు.