: గిలానీకి పాస్ పోర్టు జారీపై కాంగ్రెస్ అభ్యంతరం
కాశ్మీర్ వేర్పాటువాది, హురియాత్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీకి కేంద్ర ప్రభుత్వం తాజాగా పాస్ పోర్టు జారీ చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో గిలానీకి పాస్ పోర్టు జారీ చేయకుండా ఉండాల్సిందని ఆ పార్టీ నేత ప్రమోద్ తివారీ అన్నారు. "భారత రాజ్యాంగానికి గిలానీ వ్యతిరేకం. పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మొదట్లో గిలానీ తన జాతీయతను కూడా ప్రకటించలేదు. భారత్ లో ఉండేందుకు ఆయన సిగ్గుపడుతున్నప్పుడు పాస్ పోర్ట్ ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తన విచక్షణ మేరకు ఇచ్చేసింది. అయితే ఇటువంటి క్లిష్టపరిస్థితుల్లో అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని నా అభిప్రాయం" అని తివారీ పేర్కొన్నారు. సుమారు తొమ్మిది నెలలు వర్తించే విధంగా గిలానీకి కేంద్రం నిన్న(మంగళవారం) పాస్ పోర్టు జారీ చేసింది.