: ఆ అధికారం నాకు ఉందా?: టీ టీడీపీ నేతలకు గవర్నర్ ప్రశ్న
తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన టీ టీడీపీ నేతలకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నుంచి నిన్న వింత ప్రశ్న ఒకటి ఎదురైంది. తమ పార్టీ టికెట్ పై గెలిచిన తలసాని, ఆ తర్వాత పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారని, ఈ కారణంగా ఆయనను తక్షణమే మంత్రి పదవి నుంచి తప్పించాలని టీ టీడీపీ నేతలు గవర్నర్ ను కోరారు. ఈ సందర్భంగా ‘‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోకుండా అడ్డుకునే అధికారం నాకు ఉందా?’’ అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ టీ టీడీపీ నేతలను ప్రశ్నించారు. దీంతో షాక్ కు గురైన టీ టీడీపీ నేతలు, అందుకు దీటుగానే సమాధానం చెప్పారు. ‘‘గతంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సమాచార కమిషనర్లుగా ప్రభుత్వం ప్రతిపాదించిన రఘురామిరెడ్డి, ఇంతియాజ్ అహ్మద్ ల పేర్లను మీరు తిరస్కరించారు. రాజ్యాంగ ప్రతినిధిగా మీకు అన్ని అధికారాలున్నాయి. రాజ్యాంగాన్ని మీరు నిజస్ఫూర్తితో అమలు చేయాలి’’ అని టీ టీడీపీ నేతలు గవర్నర్ కు బదులిచ్చారు.