: కేజ్రీవాల్.... హద్దుల్లో ఉండండి!: బీజేపీ హెచ్చరిక
హద్దుల్లో ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బీజేపీ హెచ్చరికలు జారీ చేసింది. గత వారం నడి రోడ్డుపై 19 ఏళ్ల యువతిని ఇద్దరు యువకులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసి చంపిన ఘటనపై ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం, పోలీసు శాఖల మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీలోని శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేకపోవడం వల్లే దారుణాలు చోటుచేసుకుంటున్నాయని కేజ్రీవాల్ మండిపడుతున్నారు. 'శాంతి భద్రతలు మమ్మల్ని (రాష్ట్ర ప్రభుత్వం) నిర్వహించనివ్వండి. లేని పక్షంలో మీరు (కేంద్రం) జోక్యం చేసుకుని నిర్వహించండి. అంతే కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంచకండి' అంటూ ఆయన ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోదీకి సలహాలిచ్చే స్థాయి కేజ్రీవాల్ కు లేదని అంటోంది. ప్రతిదానికీ కేజ్రీవాల్ మోదీని లాగుతున్నారని, అది సరికాదని వారు హితవు పలుకుతున్నారు. కాగా, కేజ్రీవాల్ డిమాండ్ పై ఢిల్లీ పోలీసు బాస్ బస్సీ మాట్లాడుతూ, కేజ్రీవాల్ కు పోలీసు శాఖ అప్పగించాల్సిన అవసరం లేదని అంటున్నారు.