: అప్పుడేం చేశారు?: టీకాంగ్ నేతలపై విరుచుకుపడ్డ తలసాని
దివంగత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఫిరాయింపులను ఎందుకు ప్రశ్నించలేదంటూ టీ కాంగ్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉండగా రాజశేఖరరెడ్డి 'ఆపరేషన్ ఆకర్ష' చేపట్టినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా గడ్డితిన్నారా? అని నిలదీశారు. ఇప్పుడు నీతలు వల్లిస్తున్న వారంతా గత చరిత్రను తిరగేయాలని ఆయన సూచించారు. 'మీరు అధికారంలో ఉంటే ఒకలా, ఇంకొకరు అధికారంలో ఉంటే మరోలా! అలా కుదరద'ని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో చట్టం, నిబంధనలు, రాజ్యాంగం ఉన్నాయని, వాటిని అనుసరించే విధానాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్ మరణం అనంతరం కాంగ్రెస్ లో ఉంటూ వైఎస్సార్సీపీలో చేరిన నేతలు ఎన్నాళ్లు ఆ పార్టీలో ఉన్నారు? కిరణ్ కుమార్ రెడ్డి వారి రాజీనామాను ఎప్పుడు ఆమోదించారు? అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుడు కాంగ్రెస్ నేతలు చెబుతున్న నీతులన్నీ ఏమయ్యాయని ఆయన నిలదీశారు. మీ చరిత్రను మర్చిపోయి మాట్లాడకండని ఆయన ప్రతిపక్ష పార్టీలకు చురకలంటించారు. శాసనసభ స్పీకర్ కు అన్నీ తెలుసని ఆయన నిబంధనలను అనుసరించే చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. ఏం జరుగుతుందో ఓపికగా గమనించాలని ఆయన సూచించారు.