: నా వెంట పడితే ఒక్కర్ని కూడా వదిలిపెట్టను: తలసాని
తన వెంటపడితే ఒక్కర్ని కూడా వదిలి పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. హైదరాబాదులోని టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, తనకు రాజకీయ అనుభవం లేనట్టు, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలకే చట్టాలు, నిబంధనలు తెలిసినట్టు మాట్లాడడం సరికాదని అన్నారు. 'నాలుగు సార్లు ప్రజా ప్రతినిధిగా, మూడు సార్లు మంత్రిగా పని చేసిన నాకా వారు చెప్పేది?' అని ఆయన మండిపడ్డారు. తనపై రోజుకొకరు గవర్నర్, రాష్ట్రపతి దగ్గరకెళ్లి డ్రామాలాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 16వ తేదీన మీడియా సాక్షిగా స్పీకర్ కు రాజీనామా పత్రం అందజేసిన సంగతి తెలిసిందేనని ఆయన చెప్పారు. తనపై అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ, అవాకులు చవాకులు పేలుతున్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టనని ఆయన స్పష్టం చేశారు.