: అనిల్ అంబానీకి ఓ న్యాయం, నాకో న్యాయమా?: కేంద్రాన్ని ప్రశ్నించిన మారన్
ఎఫ్ఎం రేడియోల విషయంలో కేంద్రం బడా కార్పొరేట్ సంస్థలకు ఒక న్యాయం, తన సంస్థ పట్ల మరో న్యాయం ప్రదర్శిస్తోందని సన్ టివి నెట్ వర్క్ అధిపతి కళానిధి మారన్ ఆరోపించారు. 2జి వాయు తరంగాల విషయంలో అనిల్ అంబానీ గ్రూప్ పై కూడా ఆరోపణలు వచ్చాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆయనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. సెక్యూరిటీ కారణాలు చెప్పి తాము ఎఫ్ఎం తరంగాల వేలంలో పాల్గొనకుండా చేశారని అన్నారు. దేశంలోనే అత్యధిక ఎఫ్ఎం రేడియో కేంద్రాలను నిర్వహిస్తున్న సన్ టీవీ నెట్ వర్క్ తదుపరి వేలంలో పాల్గొనకుండా కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాస్తూ, "దేశంలో ఎన్నో టీవీ, ఎఫ్ఎం రేడియో కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో బడా వ్యాపారవేత్తలు నియంత్రిస్తున్న సంస్థలూ ఉన్నాయి. కొన్ని కంపెనీలు 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో కేసులను ఎదుర్కొంటున్నాయి. పెట్రోలియం శాఖలో జరిగిన అవినీతి, కార్పొరేట్ గూఢచర్యం కేసుల్లోనూ ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థలకు మాత్రం సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చారు" అని ఆరోపించారు. బిగ్ టీవీ, బిగ్ ఎఫ్ఎంల పేరిట అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ డీటీహెచ్, ఎఫ్ఎం రేడియో సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీలపై వచ్చిన అన్ని ఆరోపణలనూ సన్ నెట్ వర్క్ సీఈఓ కే షణ్ముగం మరో లేఖలో ప్రస్తావిస్తూ, కేంద్రానికి పంపారు.