: టీ20 వరల్డ్ కప్-2016 వేదికలు ప్రకటించిన బీసీసీఐ... కోల్ కతాలో ఫైనల్
వచ్చే ఏడాది భారత్ లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. మార్చ్ 11 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్ లోని వివిధ నగరాల్లో ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తారు. ఈ టోర్నీలో మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చే వేదికలను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కోల్ కతా, బెంగళూరు, చెన్నై, ధర్మశాల, మొహాలీ, ముంబై, నాగ్ పూర్, ఢిల్లీ నగరాల్లో మ్యాచ్ లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ప్రకటన విడుదల చేసిన సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ... "ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీకి ఆతిథ్యమిస్తున్నందుకు బీసీసీఐ ఎంతగానో గర్విస్తోంది. టోర్నీ కోసం ప్రకటించిన వేదికలన్నీ ఎన్నో ప్రతిష్ఠాత్మక మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చాయి. ఈ ప్రకటనతో టి20 వరల్డ్ కప్ సన్నాహాలు మొదలైనట్టే. ఫ్యాన్స్ కు, జట్లకు ఈ వరల్డ్ కప్ మరపురాని అనుభవంలా మిగిలిపోవాలని కోరుకుంటున్నాం, ఆ దిశగా శ్రమిస్తున్నాం" అని తెలిపారు.