: ఎంపీ పదవికి కడియం రాజీనామాను ఆమోదించిన లోక్ సభ స్పీకర్
తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తన లోక్ సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సమావేశాల్లో భాగంగా కడియం రాజీనామాను ఆమోదిస్తున్నట్టు సుమిత్రా మహాజన్ ప్రకటించారు. గడచిన ఎన్నికల్లో వరంగల్ ఎంపీ సీటుకు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరి విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య బర్తరఫ్ నేపథ్యంలో కడియంకు డిప్యూటీ సీఎం పదవి లభించింది. ఈ క్రమంలో ఇటీవలే ఆయన తెలంగాణ ఎమ్మెల్సీగానూ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు ఆయన తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దీనికి స్పీకర్ ఆమోదం తెలిపారు.