: ‘మాడిసన్’ను మించిపోయేలా సన్నద్ధమవుతున్న 'సిలికాన్ వ్యాలీ'
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలికేందుకు కాలిఫోర్నియాలోని ప్రవాస భారతీయులు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరం అమెరికా పర్యటనలో భాగంగా, మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో బ్రహ్మాండమైన స్వాగతం మోదీకి లభించిన సంగతి తెలిసిందే. దాన్ని మించిపోయేలా మోదీకి ఆతిథ్యం ఇవ్వాలని సిలికాన్ వ్యాలీ భావిస్తోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ లో మోదీ కాలిఫోర్నియాకు వెళ్లి, ఆపై భారత సంతతి, ఇండియన్ ఎంప్లాయిల సంఖ్య అధికంగా ఉన్న సిలికాన్ వ్యాలీలో ప్రసంగిస్తారు. మోదీకి ఘన స్వాగతం పలికేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై సన్నాహక సమావేశాలు సైతం ప్రారంభమయ్యాయి. న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి (ఐరాస) వార్షిక జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న మోదీ, టెక్ కాపిటల్ సిలికాన్ వ్యాలీని సందర్శించి, ఐటీ రంగంలోని పారిశ్రామికవేత్తలు సహా భారత సంతతికి చెందిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సుమారు 20 వేల మంది ఈ సభకు హాజరవుతారని తెలుస్తున్నప్పటికీ, ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.