: పోలీసులకు మస్కా కొట్టిన రిమాండ్ ఖైదీలు... కోర్టుకు తీసుకెళుతుండగా పరారీ
ఏపీలో మరోసారి రిమాండ్ ఖైదీలు రెచ్చిపోయారు. కోర్టు విచారణకు తీసుకెళుతున్న పోలీసులకు మస్కా కొట్టి పరారయ్యారు. అజాగ్రత్తగా ఉన్న పోలీసులు ఆ తర్వాత మేల్కొని పరారైన దొంగల కోసం వేట మొదలుపెట్టారు. వివరాల్లోకెళితే... పలు నేరాలకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఓ కేసు విచారణ నిమిత్తం వీరిని పోలీసులు అనంతపురం జిల్లాకు తరలించాల్సి వచ్చింది. నిన్న రాత్రి జైలు అధికారులు ఎస్కార్ట్ తో వారిని అనంతపురం తరలిస్తుండగా, ప్రకాశం జిల్లా గిద్దలూరు వద్ద రిమాండ్ ఖైదీలు ఎస్కార్ట్ సిబ్బందికి మస్కా కొట్టారు. చాకచక్యంగా పోలీసుల దృష్టిని మరల్చి కాళ్లకు బుద్ధి చెప్పారు. ఎస్కార్ట్ సిబ్బంది తేరుకునేలోగానే వారిద్దరూ అక్కడి నుంచి మాయమైపోయారు. దీంతో షాక్ తిన్న ఎస్కార్ట్ సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి, పరారైన ఖైదీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.