: తెలంగాణ ఏసీబీపై ‘తెలుగు యువత’ నేత ఘాటు వ్యాఖ్య
ఓటుకు నోటు కేసులో రోజుకో కొత్త అంశాన్ని బయటపెడుతున్న తెలంగాణ ఏసీబీ అధికారులపై టీడీపీ యువజన విభాగం తెలుగు యువత నేత ప్రదీప్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తన ప్రమేయానికి సంబంధించి ఏసీబీ అధికారులకు ఏమీ తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో మరో నలుగురితో కలిసి ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా సాగిన విచారణ అనంతరం బయటకు వచ్చిన ప్రదీప్ చౌదరి మీడియాతో మాట్లాడారు. తనకున్న పరిచయాలపై ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధించారని ఆయన తెలిపారు. ఓటుకు నోటుతో సంబంధముందా? అని కూడా ఏసీబీ ప్రశ్నించిందన్నారు. కేసుతో తనకెలాంటి సంబంధం లేదని చెప్పానన్నారు. అసలు ఈ కేసులో తన ప్రమేయం ఏమిటో ఏసీబీకే తెలియడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.