: పగలు పాలన... రాత్రి వినోదాల సందడి: నిద్రపోని నగరంగా అమరావతి!
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రపంచంలోనే అగ్రశ్రేణి నగరంగా రూపుదిద్దుకోనుందట. కంటి మీద కునుకు వేయని నగరంగా అమరావతిని తీర్చిదిద్దనున్నట్లు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ నుంచి అమరావతి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ అందుకున్న సందర్భంగా చంద్రబాబు నిన్న పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. అమరావతిలో పగలంతా పాలన సాగితే, రాత్రి కాగానే వినోదాల హరివిల్లు ఆరంభమవుతుందని ఆయన చెప్పారు. వెరసి అమరావతిని ‘నిద్రపోని నగరం’గా తీర్చిదిద్దనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందుకోసం అమరావతిలో రాత్రంతా తెరిచి ఉంచే రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, కెఫేలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్, ఛత్తీస్ గఢ్ ల రాజధానులు గాంధీ నగర్, నయా రాయ్ పూర్ లను ప్రస్తావించిన చంద్రబాబు.. ఆ రెండు నగరాలకు భిన్నంగా ప్రపంచ అగ్రశ్రేణి నగరాల్లో అమరావతికి స్థానం కల్పిస్తామని ప్రకటించారు. రాజధాని అంటే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సమూహం కాదన్న ఆయన, ‘జీవం, జీవితం’ ఉట్టిపడేలా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. కొత్త రాజధానికి ప్రత్యేక శోభనిచ్చేలా జలమార్గం ఏర్పాటు చేస్తామన్నారు. వెనిస్ నగరం తరహాలో నగరం నడిబొడ్డున పడవల్లో విహరించవచ్చని ఆయన తెలిపారు. ఇక ప్రధాన నిర్మాణాలన్నీ నదీముఖంగా ఉండేలా నిర్మిస్తామన్నారు. దేశ రాజధానికే తలమానికంగా ఉన్న ‘రాజ్ పథ్’ తరహా విశాల రహదారులను కూడా అమరావతిలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.