: రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ బంపర్ ఆఫర్... హరీశ్ రావే స్వయంగా పిలిచారట!
కొత్త రాష్ట్రం తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన ‘ఆకర్ష్’ మంత్రాన్ని అన్ని పార్టీలకు చెందిన నేతలపైకి విసురుతోంది. ఆ పార్టీతో ప్రత్యక్ష పోరుకు దిగిన టీ టీడీఎల్పీ ఉపనేత, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డిపై కూడా టీఆర్ఎస్ వల విసిరిందట. ఈ మేరకు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. ఆయా నేతల స్థాయిని బట్టి వారికి సరితూగే నేతలను టీఆర్ఎస్ రంగంలోకి దించుతుండగా, రేవంత్ కు ఈ తరహా ఆఫర్ చేసేందుకు తెలంగాణ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు స్వయంగా రంగంలోకి దిగారట. హరీశ్ రావు చేసిన ఆఫర్ ఏమిటి, తాను హరీశ్ రావుకు ఏం చెప్పానన్న విషయాలను వెల్లడించేందుకు మాత్రం రేవంత్ రెడ్డి నిరాకరించారు. ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించేందుకు ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అవకాశం దొరికినప్పుడు తప్పనిసరిగా ఈ విషయాలను బహిర్గతం చేస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.