: ఫిఫా అధ్యక్షుడికి అడ్డు తగిలిన బ్రిటీష్ హాస్యనటుడు
ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ కు జ్యూరిచ్ లో సోమవారం ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. ఫిఫా ప్రధాన కార్యాలయంలో బ్లాటర్ నిర్వహించిన మీడియా సమావేశానికి హాజరైన బ్రిటీష్ కమెడియన్ సైమన్ బ్రాడ్కిన్ రసాభాస చేశాడు. ముందు వరుసలోనే కూర్చున్న బ్రాడ్కిన్ పైకి లేచి తన చేతిలోని ఫేక్ కరెన్సీ నోట్లను బ్లాటర్ పై వెదజల్లాడు. దీంతో, అక్కడ కాస్తంత ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో, ముందు ఇక్కడ శుభ్రపరచాల్సి ఉందంటూ బ్లాటర్ వెంటనే కాన్ఫరెన్స్ హాల్ నుంచి వెళ్లిపోయారు. కాసేపాగి వచ్చి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... "చనిపోయిన మా అమ్మతో సంభాషించాను. బాధపడవద్దని, విద్య లేని కారణంగానే అతను అలా ప్రవర్తించి ఉంటాడని చెప్పింది" అని పేర్కొన్నారు. సాకర్ కు, ఈ ఘటనకు సంబంధం లేదని అన్నారు. కాగా, బ్రిటీష్ హాస్యనటుడు బ్రాడ్కిన్ కిందటి నెలలో గ్లాస్టన్ బరీ ఫెస్టివల్ లో కాన్యే వెస్ట్ సంగీత కచేరీలోనూ ఇలాంటి చేష్టలకు పాల్పడ్డాడట.