: ఎవరి వ్యూహాలు వారివే... మరి పైచేయి ఎవరిది?


పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, విపక్షాలు ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలై ఉన్నారు. విమర్శలు గుప్పించేందుకు, ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుండగా, ఎదురు దాడికి దిగాలని అధికార పక్షం సంకేతాలు ఇస్తోంది. దీంతో అధికార, విపక్షాల్లో విజయం ఎవరిని వరిస్తుందోనంటూ రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఎన్నో బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిల్లో కీలకమైన రైల్వేల ఆధునికీకరణ, భూసేకరణ, లోక్ పాల్, లోకాయుక్త సవరణలు వంటి బిల్లులు ఉన్నాయి. దీంతో వాటిని గట్టెక్కించేందుకు విపక్షాలు కలిసి రావాలని ప్రధాని నేడు జరిగిన అఖిల పక్షం సమావేశంలో పిలుపునిచ్చారు. కాగా, ఆయన వినతిపై రాజకీయ పక్షాలు వివిధ రకాల స్పందనలు వినిపించాయి. తాజా వర్షాకాల బడ్జెట్ సమావేశాలను అడ్డంపెట్టుకుని త్వరలో జరుగనున్న బీహార్ ఎన్నికలకు బాటలు వేసుకోవాలని బీజేపీ భావిస్తుండగా, బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులను అడ్డంపెట్టుకుని ఆ పార్టీ ఆశలకు గండికొట్టాలని బీహార్ కు చెందిన బీజేపీయేతర పార్టీలు భావిస్తున్నాయి. భూసేకరణ బిల్లును అడ్డుకుంటామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించగా, మమతా బెనర్జీ అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యేందుకే ఇష్టపడలేదు. వామపక్షాలు బీజేపీ బిల్లులను అడ్డుకుంటామని భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాయి. టీఆర్ఎస్ తటస్థ వైఖరి అవలంబిస్తుండగా, టీడీపీ మాత్రం బీజేపీ మాటే తమ మాట అని స్పష్టం చేసింది. ఈ క్రమంలో భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ అన్నా హజారే నిరాహార దీక్షకు దిగనుండడాన్ని బీజేపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలని అంతా ఆసక్తితో ఉన్నారు. ఈ నేపధ్యంలో బీజేపీ బిల్లులను పాస్ చేయించుకోగలుగుతుందా? లేక విపక్షాలు తమ మాట నెగ్గించుకుంటాయా? అని విశ్లేషకులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News