: పేదల కోసం క్లినిక్ ప్రారంభించిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ కేంటీన్లు ప్రారంభించి మన్ననలు అందుకున్న కేజ్రీవాల్, వినోదపు పన్ను, పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచి విమర్శలపాలయ్యారు. ఈ నేపధ్యంలో మురికివాడల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆమ్ ఆద్మీ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ క్లినిక్ ప్రారంభించి అభినందనలు అందుకుంటున్నారు. ఢిల్లీలో పేదలకు వైద్యం ఖరీదైపోవడంతో, ఉచిత వైద్య పథకం అందించేందుకు ఆప్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఆసుపత్రిలో జ్వరం నుంచి డయాబెటిస్ వరకు అన్ని వ్యాధులకు వైద్యం అందుబాటులో ఉంటుందని ఆయన చెప్పారు. రోగి రాగానే రక్త పరీక్ష నిర్వహించి, తక్షణం రిపోర్టులు అందించే సౌకర్యం అందుబాటులో ఉండనుంది. అలాగే పూర్తి ఏసీ సౌకర్యం కల్పించబడిన ఈ క్లినిక్ లు కార్పొరేట్ ఆసుపత్రి కంటే మెరుగైన వైద్య సదుపాయం కలిగిస్తాయని ఆయన చెప్పారు. ఈ క్లినిక్ లలో ఎలాంటి అవినీతి ఉండదని ఆయన స్పష్టం చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ఆయన తెలిపారు. బడ్జెట్ సందర్భంగా 500 క్లినిక్ లు ప్రారంభిస్తామని చెప్పామని, కానీ, ఢిల్లీ వ్యాప్తంగా వెయ్యి క్లినిక్ లు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.