: అలాంటి నేతలు మనకు అవసరం లేదు: హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ నేతలపై ధ్వజమెత్తారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు హరీశ్ రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... మహబూబ్ నగర్ నీటిని అనంతపురం తరలిస్తుంటే డీకే అరుణ హారతి పట్టారని, అలాంటి నేతలు మనకు అవసరం లేదని పార్టీ శ్రేణులను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ మునుగుతున్న నావ అని, ఇక లేవదని వ్యంగ్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోనూ మునిగిపోయింది, గల్లీలోనూ మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. పాలమూరు ప్రజలు ఇకపై సన్నబియ్యం పండించవచ్చని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారని హరీశ్ రావు తెలిపారు.