: భారత హాకీ కోచ్ పై వేటు
భారత హాకీ జట్టు కోచ్ గా ఏడాది కాలం కూడా పూర్తి చేసుకోకముందే డచ్ జాతీయుడు పాల్ వాన్ ఆస్ పై వేటు పడింది. వాన్ ఆస్ కు ఉద్వాసన పలుకుతున్నట్టు హాకీ ఇండియా (హెచ్ఐ) పేర్కొంది. కాగా, వాన్ ఆస్ తొలగింపునకు హెచ్ఐ ఎలాంటి కారణాలు వెల్లడించలేదు. ఇటీవలే ముగిసిన హాకీ వరల్డ్ లీగ్ లో భారత జట్టు ఆటతీరుపై సకాలంలో నివేదిక సమర్పించనందుకు ఆయనపై హెచ్ఐ గుర్రుగా ఉన్నట్టు వార్తలు వస్తున్నా, అసలు విషయం అది కాదని అర్థమవుతోంది. మీడియా కథనాల ప్రకారం.... బెల్జియంలోని ఆంట్వెర్ప్ లో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ లో భారత్, మలేసియా జట్ల మధ్య మ్యాచ్ అనంతరం కోచ్ వాన్ ఆస్, హెచ్ఐ అధ్యక్షుడు నరిందర్ బాత్రా మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. మ్యాచ్ ముగియగానే బాత్రా ఫీల్డ్ లో ప్రవేశించి ఆటగాళ్లతో మాట్లాడారు. ఇంతలో వాన్ ఆస్ అక్కడికి వచ్చి బాత్రాను బయటకు వెళ్లాల్సిందిగా కోరాడు. దీంతో, ఒళ్లు మండిన హెచ్ఐ అధ్యక్షుడు కోచ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.