: రాష్ట్రపతి భవన్ ఒక నెల ఫోన్ బిల్లు రూ. 5.06 లక్షలు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నివసించే రాష్ట్రపతి భవన్ కు గడచిన ఏప్రిల్ లో రూ. 5.06 లక్షలు, అంతకుముందు మార్చిలో రూ. 4.25 లక్షల ఫోన్ బిల్లులు వచ్చాయి. ఈ వివరాలు ఎలా బయటకు వచ్చాయంటే... రాష్ట్రపతి నివాస భవనంలో నెలకు ఫోన్ బిల్లు ఎంత వస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు ముంబై వాసి మన్సూర్ దర్వేశ్. అంతే, వెంటనే సామాన్యుడి ఆయుధంగా సేవలందిస్తున్న సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు నింపి పంపాడు. రాష్ట్రపతి భవనం నిర్వహణ, ఉద్యోగుల సంఖ్య, వారికి వేతనాలు తదితర వివరాలన్నీ తనకు కావాలని కోరాడు. స.హ చట్టం ప్రకారం అధికారులు పూర్తి వివరాలు పంపగా, అందులో ఫోన్ బిల్లుల మొత్తం కూడా ఉంది. దీన్ని చూసి ఇంత బిల్లా? అని ఆశ్చర్యపోవడం మన్సూర్ వంతైంది. కాగా, 2012-13 బడ్జెట్ లో రాష్ట్రపతి భవన్ కు రూ.30.96 కోట్లు కేటాయించిన ఆర్థిక శాఖ, 2014-2015 ఆ మొత్తాన్ని రూ. 41.96 కోట్లకు పెంచింది. మొత్తం 754 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో తొమ్మిది మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, 27 మంది డ్రైవర్లు, 64 మంది సఫాయికారులు ఉన్నారు. వీవీఐపీ అతిథులు వచ్చినప్పుడు పెట్టే ఖర్చు కూడా ఈ నిధుల నుంచే ఖర్చు చేస్తామని ప్రత్యేక బడ్జెట్ ఏమీ ఉండదని ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ స్పష్టం చేసింది.