: చేపలు పట్టడం మానేసి...డబ్బులు పట్టుకుంటున్నారు!


రాజమండ్రి పుష్కరాల సందర్భంగా మత్స్యకారులు తమ కుల వృత్తిని వదిలేశారు. మామూలుగా చేపలుపట్టి, మార్కెట్ కి వెళ్లి అమ్ముకుని, అలా వచ్చిన డబ్బులతో పొట్టపోసుకుంటారు. ఇది కష్టంతో కూడిన పని. అందుకేనేమో, ఇప్పుడు ఏకంగా డబ్బులే పట్టుకుంటున్నారు. పుష్కరాల సందర్భంగా గోదావరి ఒడ్డుకు భక్తులు పోటెత్తుతున్నారు. గోదారమ్మ ఒడిలో మునకలేసిన భక్తులు తరువాత ఆ నదీమతల్లికి కానుకగా నాణేలను నదిలో జారవిడుస్తున్నారు. దీనిని గమనించిన మత్స్యకారులు ఈ నాణేలను దొరకబుచ్చుకునేందుకు పోటీలు పడుతున్నారు. రాజమండ్రి, భద్రాచలం అనే తేడా లేకుండా, నదిలో చేపల వేటకు ఉపయోగించే బోట్లు, తెప్పలకు ఉండే యాంకర్లకు అయస్కాంత దిమ్మలను కట్టి నీట్లోకి జారవిడుస్తున్నారు. ఈ అయస్కాంతాలు భక్తులు నదిలో విడిచిన నాణేలను ఆకర్షించి, మత్స్యకారుల జేబులు నింపుతున్నాయి. పుష్కర ఘాట్లలో భక్తులు లోతు నీళ్లలోకి వెళ్లకుండా, అడ్డు పెట్టిన తెప్పలపై నిలబడి మత్స్యకారులు నాణేల వేట జరుపుతున్నారు. దీంతో చేపలు పట్టడం కంటే నాణేలు పట్టడం బాగానే గిట్టుబాటవుతోందని వారు ఆనందంగా చెబుతున్నారు.

  • Loading...

More Telugu News