: బృందావనంలో రూ. 500 నోట్ల వర్షాన్ని కురిపించిన కోతి


మీరు చదివింది నిజమే. బృందావనంలో ఓ కోతి రూ. 500 నోట్ల వర్షాన్ని కురిపించింది. రూ. 500 నోట్ల 3 బండిల్స్ పట్టుకొచ్చిన కోతి వాటిని భక్తులపై కురిపించింది. మొత్తం లక్షన్నర రూపాయలను కోతి విసిరేస్తుండగా, వాటిని ఏరుకునేందుకు భక్తులు పోటీ పడి పరుగులు పెట్టారు. ముంబై నుంచి టూరిస్టులుగా వచ్చిన హేమవతి అనే భక్తురాలి హ్యాండ్ బ్యాగును లాక్కెళ్లిన కోతి అందులోని కరెన్సీని విసిరేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడి బన్కీ బారీ దేవాలయం ముందున్న సన్నని రద్దీ రహదారిలో తాము వెళుతున్నప్పుడు ఓ పెద్ద కోతి వచ్చి తన బ్యాగ్ లాక్కెళ్లిందని హేమవతి వివరించారు. ఓ షాపుపై కూర్చున్న కోతి బ్యాగు తెరచి కరెన్సీ బండిల్స్ సీల్ తీసి మరీ నోట్లను విసిరేసిందని, అక్కడి యాచకులు, వారి పిల్లలు, కొందరు షాపుల వారు నోట్లను ఏరుకునేందుకు ఎగబడ్డారని పేర్కొంది. తన కుమార్తె వారిని నివారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, కొందరు యువకులు మాత్రం కింద పడుతున్న కొన్ని నోట్లను సేకరించి తిరిగి తమకు ఇచ్చారని తెలిపారు. కాగా, ఈ హడావుడిలో హేమవతి వద్ద ఉన్న రూ. 30 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను ఎవరో కొట్టేశారు కూడా. లక్ష రూపాయలకు పైగా డబ్బు పోగొట్టుకుని బరువెక్కిన హృదయాలతో హేమవతి కుటుంబం బృందావనాన్ని వీడి వెళ్లింది. ఈ ఘటన గురించి తమకు తెలిసిందని, అయితే, ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఇవి భక్తుల నుంచి ఖరీదైన కెమెరాలు, కళ్లద్దాలు తదితరాలు తీసుకెళ్లి తమకు ఆహారాన్ని ఇస్తేనే వాటిని జారవిడవడం నేర్చుకున్నాయని, ఒక్కోసారి భక్తులపై దాడులు కూడా చేస్తున్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News