: "ఇదంతా 'బీరు' మహిమే సుమా!" అంటున్న వందేళ్ల బామ్మ గారు!
నిజమేనండోయ్, లండన్ కు చెందిన గ్లాడీస్ ఫీల్డన్ తన వందేళ్ల జీవనయానానికి బీరే కారణమని చెబుతోంది. ఇటీవలే లండన్ లో తన వందో పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. రోజూ బీరుతోనే తాను బ్రేక్ ఫాస్ట్ చేస్తానని కూడా ఆమె పేర్కొంది. గడచిన డెబ్బై ఏళ్లుగా ఆమె ఇదే సూత్రాన్ని క్రమం తప్పకుండా పాటిస్తోంది. ఇక ఆమె తాగే బీరు పేరు కూడా విచిత్రమైనదే. ఈమె తాగే బీరును ‘గిన్నీస్’ అనే కంపెనీ తయారుచేస్తోందట. ఇక తన ఆనుభవాన్ని ఆమె చాలా ఆసక్తికరంగా చెబుతోంది. ‘‘ప్రతి రోజు ఉదయాన్నే 10.30 గంటలకు గిన్నీస్ బీరు తాగుతాను. దానికి కొంత వెనిగర్, ఉప్పు కలుపుతాను. గత 70 ఏళ్లుగా ఇలాగే చేస్తున్నాను. ఇలా తాగడం వల్లే ఇన్నేళ్లుగా బతికి ఉన్నాను’’ అని గ్లాడీస్ చెప్పింది. ఎప్పుడో 70 ఏళ్ల కిందట గర్భవతిగా ఉన్నప్పుడు ఆరోగ్యమని ఎవరో చెబితేనే గ్లాడీస్ బీరు రుచి చూసిందట. ఇక అప్పటి నుంచి రోజూ బీరు లాగిస్తూనే ఉందట. ఇంకో ఆశ్చర్యకర విషయమేమిటంటే 90 ఏళ్లు వచ్చేదాకా గ్లాడీస్ ఓ బేకరీలో పనిచేసిందట. ఇదిలా ఉంటే, గ్లాడీస్ ప్రకటన తమకు ఉచిత ప్రచారమేనని సంతోషపడ్డ ‘గిన్నీస్’ బీరు కంపెనీ, ఆమెకు ఓ కేసు బీర్లను ఉచితంగా అందించిందట!