: ఐదేళ్ల కనిష్ఠానికి పుత్తడి, కానీ మనం రూ. 3 వేలు ఎక్కువ పెడుతున్నాం... ఎందుకంటే!
అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో పాటు ప్లాటినం ధరలు ఐదేళ్ల కనిష్ఠస్థాయికి దిగజారాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బులియన్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుని బాండ్లలో పెడుతుండటమే ధరల పతనానికి ప్రధాన కారణం. ఇదే సమయంలో ఇండియాలో అమ్మకాలు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, బంగారం ధరలు ఇంటర్నేషనల్ స్థాయితో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. యూఎస్, సింగపూర్, దుబాయ్ తదితర దేశాల్లో బంగారం ధరతో పోలిస్తే భారతీయులు పది గ్రాములకు సుమారు రూ. 3 వేలు అధికంగా చెల్లించాల్సి వస్తోంది. ఇందుకు పలు కారణాలున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,106.90 డాలర్ల వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 2.4 శాతం తక్కువ. మార్చి 2010లో 1,088 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధర తిరిగి అదే స్థాయికి దగ్గరకావడం ఇదే తొలిసారి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కో గ్రాము సుమారు 36 డాలర్లకు లభిస్తుండగా, అదే లెక్కన పరిశీలిస్తే, ఇండియాలో గ్రాము బంగారం రూ. 2,300కు లభించాలి. కానీ రూ. 2,600 వద్ద ధర కొనసాగుతోంది. అంటే పది గ్రాముల బంగారం ధర రూ. 23,000 ఉండాల్సి వుండగా, రూ. 26,000 వద్ద కొనసాగుతోంది. దిగుమతి చేసుకునే బంగారంపై కేంద్రం విధించిన 10 శాతం కస్టమ్స్ సుంకం, ఒక శాతం వ్యాట్, దిగుమతి చార్జీలు, ఇతర ఖర్చులు కలుపుకుని 12 శాతం వరకూ భారం పడుతోంది. దీన్ని కొనుగోలుదారులు మోయాల్సి రావడమే ధరలో ఇంత తేడా ఉండటానికి కారణం. పది గ్రాముల బంగారంలో రూ. 3 వేలు తేడా ఉండగా, అదే ఒక కిలో అయితే, ఏకంగా రూ. 3 లక్షలు తేడా కనిపిస్తోంది. దుబాయ్, మలేషియాల నుంచి బంగారం స్మగ్లింగ్ పెరగడానికి ఇదే కారణం. దుబాయ్ వెళ్లి వచ్చేందుకు రూ. 30 నుంచి రూ. 40 వేలు చాలు. ఓ కిలో బంగారాన్ని అధికారుల కళ్లుగప్పి తేగలిగితే దాదాపు రెండున్నర లక్షల రూపాయలకు పైగానే మిగులుతుంది. అందుకే ఇటీవలి కాలంలో బంగారం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇదిలావుండగా, వరుసగా మూడవ సంవత్సరంలోనూ బంగారం ధర తగ్గుదల బాటలోనే నడుస్తోంది. సమీప భవిష్యత్తులో ధరలు మరింతగా తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.